Thursday, August 16, 2007

ఆంద్రప్రదేశ్ ...రాజీవ్ ప్రదేశ్....ఇందిరా ప్రదేశ్

చిన్నప్పుడు ఒక సామెత వినేవాడిని " పని లేని మంగలోడు పిల్లి తల గొరికాడు " అని అంధ్రప్రదేశ్ లో కాంగ్రేస్ వాళ్ళ పని అలానే వుంది...

రాష్ట్రంలో కుప్పలు కుప్పలు గా సమస్యలుంటే అవన్నీ వదిలేసి 40 సంవత్సరాల క్రితం పుట్టిన కూకటపల్లి హౌసింగ్ బోర్డ్ పేరును రాజీవ్ గాంధి హౌసింగ్ బోర్డ్ అని పేరు మారుస్తున్నాము అని కొత్త గొడవ పైకి తెచ్చింది ఇవ్వాల...

ఈ మద్యకాలంలో నేనే కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలుపెట్టిన రకరకాల స్కీముల పేర్లు చూసి .... దేని పేరు ఇందిరో దేని పేరు రాజీవో అర్దం కాక కనుఫ్యూజ్ అవుతున్నాను...

దేనికయినా ఒక లిమిట్ అంటూ వుంటుంది ......ఆ లిమిట్ దాటబట్టే బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు పట్టిన మనము ......అదే కాళ్ళు పట్టుకుని వాళ్ళ దేశానికి విసిరి కొట్టింది......పాలకులు చెసే ప్రతీ పని ప్రజలు చూస్తుంటారు .......కొంత వరకు తప్పులను క్షమిస్తారు... లిమిట్ దాటితే పాలకులు రోడ్డు మీద పకీర్లు కావలసిందే .....చూస్తుంటే కాంగ్రేసోల్లు పధకాలకు పేర్లు పెట్టే విషయంలో ఆ లిమిట్ ఎప్పుడో దాటేసారు .......ఇప్పటికి 23 పధకాలకు రాజీవ్, ఇందిర పేర్లు పెట్టారంట (ఈనాడు ప్రకారం)

కాంగ్రెసోల్లకు అంత అభిమానం వుంటే వాల్ల పిల్లలకో, తల్లులకో ఆ పేర్లు పెట్టుకొవచ్చు గా.....లేకపొతే వాళ్ళ కంపెనీలకు పెట్టుకొవచ్చుగా ...నేను ఏమి రాజీవ్, ఇందిరలకో లేక కాంగ్రెస్ కో వ్యతిరేకిని కాదు.... నేనూ వాళ్ళను గౌరవిస్తాను కాని వాళ్ళకంటే గొప్పవాళ్ళు చాల మంది వున్నారు.... మన రాష్ట్రంలొనే వున్నారు......ఒక అల్లూరి సీతరామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, వీరేశలింగం పంతులు, సర్వేపల్లి రాధాక్రిష్ణ, పొట్టి శ్రీరాములు ఇలా చెప్పుకుంటూ పొతే ఈ లిస్ట్ కి ఎండ్ లేదు .....కాని పాపం మన కాంగ్రేసోల్లకు మతిమరుపు వచ్చినట్టు వుంది...... వీళ్ళకు కేవలం ఇందిర, రాజీవ్ లే గురుతున్నారు......

ఇంక మన విపక్షాల కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ...... కుర్చీ కోసం నక్కల్లా ఎదురుచూస్తు ఎప్పుడు బందులు చేద్దామా .....ఎప్పుడు పేపర్ లో మొదటి పేజ్ లో ఉందామ అని ఎదురు చూస్తుంటారు......వీళ్ళు దొరికిందే సందు అని కూకటపల్లి హౌసింగ్ బోర్డ్ పేరు మారుస్తున్నందుకు ఈ రోజు షాపులు, స్కూల్లు గట్రా బంద్ చేశారు ... పేరు మార్చిన కాంగ్రేసోల్లను ఏమి అనలేక ప్రజలను ఇబ్బంది పెట్టారు... ఈ ప్రతిపక్షాలు నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకుంటే వెళ్ళి పేరు మారుస్తాను అని అన్న వాడి ఇంటిని బంద్ చేయొచ్చు గా .....అలా చేయరు......ఎందుకంటే వీళ్ళకు అంత సీన్ లేదు......ప్రజలంటే పిచోళ్ళు వీళ్ళు చెప్పినవెంటనే షాపులు మూసెస్తారు ఎందుకంటే ఏ తిక్కోడు రాళ్ళు వేస్తాడో అని..... ఎంతకాలం ఈ రాజకీయ పార్టీల డ్రామాలు చూస్తుండాలి ...... ఏడుకొండలవాడా వీళ్ళను నువ్వే మార్చాలి లేకపొతే ... తిరుమల కొండను కూడ రాజీవ్ కొండ గా మార్చెస్తారు.......జర జాగ్రత్త...

ఆంద్రప్రదేశ్ ...రాజీవ్ ప్రదేశ్....ఇందిరా ప్రదేశ్

Saturday, August 11, 2007

ముదిగొండ ఆత్మ ఘోష

హలో నా పేరు ఆత్మా... అవును మనిషి చనిపోయాక బయటకు వచ్చేది ఆత్మే అయితే నా పేరు అదే..

10 రోజుల క్రితం నేను మనిషినే, మీలో ఒకడినే... ముదిగొండ అనే ఊర్లో కూలిపని చేసుకుంటూ బ్రతికేవాడిని ...కాని ఆ రోజు ఎవరో నాయకుల మాటలు విని భూపోరాటం అంటే ఇంటి కోసం స్థలం ఇస్తారు అనుకొని వెళ్ళాను కాని ఆ రోజు సాయంత్రం జరిగిన కాల్పులలో చనిపోయాక తెలిసింది నేను చేసిన భూపోరాటం ఇంటికోసం కాదు నన్ను కప్పెట్టటానికి కావలసిన ఆరు అడుగుల స్థలంకోసం అని...!!!

నేను చనిపోయాక నా శవంతో నాయకులు వేసిన నాటకాలు నా శవం పక్కనే వుండి చూసిన నాకు అంటే నా ఆత్మకు ఆశ్చర్యం వేసింది ....ఆ మొత్తం సంఘటన నా ఆత్మ ఘోషలో...

ముదిగొండ కాల్పులు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరినోట అయ్యొ పాపం అనేలా చేసాయి...కాని మన నాయకులు మాత్రం కేవలం రాజకీయలబ్ది కోసం మా ఈ చావులను, చచ్చిన శవాలను చివరి నిమిషం వరకు వాడుకోవటానికి ప్రయత్నించిన పద్దతి చూస్తుంటే... వీరికా మేము ఓట్లు వేసి గెలిపించింది అని సిగ్గుతో నాలో నేనె కుమిలిపోయాను...

వీధి కుక్కలు కూడ చచ్చిన శవాన్ని వాసన చూసి ఒక గంట సేపటికి వెల్లిపోతాయి .....కాని మన వీధి నాయకులు వాటికంటే మేము ఏమి తక్కువ అన్నట్టు మా శవాలను కలక్టరేటు ముందు పెట్టి వారి వారి పార్టీల జెండాలు మా శవాల మీద కప్పి రాబొయే ఎన్నికలలో గెలుపు కోసం పడుతున్న పాట్లు చూసి విమర్శించటానికి నాకు తెలుగు నిఘంటువులో పదాలు దొరకలేదు...అసలు కూలి పని చేసుకొని బ్రతికే నేను ఎప్పుడు ఏ పార్టీ సభ్యత్వము తీసుకొలేదు కాని ఇవ్వాల మాత్రం నా శవం మీద వీళ్ళ పార్టీ జెండాలు కప్పారు.....పొనీలే నేను బ్రతికుండగా ఏనాడు ఒక్క దుప్పటి కూడ ఇవ్వలేదాయే చచ్చినాకన్నా ఒక గుడ్డ ముక్క ఇచ్చారు అని సరిపెట్టుకున్నాను.


ఈ నాయకుల ఇంట్లో ఎవరన్నా చస్తే వారి శవాలను మాత్రం భద్రంగా ఒక బాక్స్ లో పెట్టి దానికి పూలదండలు వేసి వుంచుతారు, లభోదిభో అంటు ఎడుస్తారు...కాని ఇక్కడ చనిపోయిన మా శవాలను మా పెళ్ళాం, బిడ్డలకు కూడ ఇవ్వకుండ, గద్దలు తన్నుకు పోయినట్టుగా తన్నుకుపోయి మండుటెండలో కలక్టర్ అఫీసు ముందు పెట్టి ఓట్ల కోసం కాట్ల కుక్కల్లా ప్రవర్తించారు...అంతే కాకుండా...చిత్రమేమిటంటే ఒక పార్టీ వాళ్ళు మా శవాల దగ్గర ముందు వరసలో నుంచిని నవ్వు కోవటం వారికి మా మీద వున్న అభిమానానికి మచ్చుతునక...

మా శవాలు ఇంకా కాలక ముందే మన నాయకులు ఈ ఉద్యమాన్ని నేను మొదలుపెట్టానంటే నేను మొదలుపెట్ట అని మీడియా ముఖం గా చేసిన వ్యాఖ్యలు చూసి ....అయ్యో అనవసరంగా మన తాత ముత్తాతలు తెల్ల వాల్లను తరిమి కొట్టరే అని చాలా బాద వేసింది.

ఈ మొత్తం సంఘటనలో రాజకీయ పార్టీలు మా శవాలను ముందుపెట్టుకొని పేపర్ లో ఫోజులు ఇచ్చారు గాని చనిపోయిన మా మీద ఆధారపడి బ్రతుకుతున్న వారి కోసం ఒక్కడూ నోరు విప్పలేదు........కాల్పులకు బాధ్యుడు అంటూ ముఖ్యమంత్రి దిగిపొవాలి అన్నారు గాని బందుకు పిలుపునిచ్చి ఈ పరిస్థితికి కారణమయిన వాళ్ళను పల్లెత్తుమాట అనలేదు...

సీట్ల విలువ తెలిసిన ఈ నాయకులకు ఓట్లు వేసిన మా ప్రాణాల విలువ ఎప్పట్టి కి తెలుస్థుందో...!!!

Thursday, August 9, 2007

ప్రార్ధన

అందరూ ఒక మంచి పని మొదలు పెట్టేటప్పుడు శుభం జరగాలని ఎలాగయితే విఘ్నేశ్వరుడ్ని ప్రార్ధిస్తారో నా ఈ కవిత కూడ అలాంటిదే...
నాయకుడ నాయకుడ నరరూప రాక్షసుడా...
మనసు గల మానవుడిగా నువ్వు మారెదెన్నడు రా...

అభయ హస్థమే చూపి అన్యాయం చేసావు
గాంధీజి శాంతి పధం గాలికి వదిలేసావు

మయి నారిటి మంత్రం తో కులమతాల చిచ్చు రేపి
వొట్ల బిక్షమెత్తి నీవు కోట్లు గడిస్తున్నావు

ఇరిగేషన్ పేరు చెప్పి ఇల్లు నింపుకున్నావు
రైతు కడుపు కొట్టి నువ్వు రాజ్యమేలుతున్నావు

పదవి కోసమే నువ్వు పాకులాడుతున్నావు
ప్రజల కష్టసుఖాలను పక్కన పెట్టావు

ప్రజాప్రతినిధిని అంటు విర్ర వీగుతున్నవు
ప్రజల నిధిని తింటు నువ్వు పైకెదుగుతు వున్నావు

రాముడిని, అయోధ్యను రాజకీయం చేసావు
మానవత్వమే మరచి ముస్లిం లను వూచకోతకోసావు

ప్రాంతీయత పేరు తోటి పవర్ లోకి వచ్చావు
నకిలి పాస్పోర్టులతో నల్ల ధనం తిన్నావు
తెలంగాణ పరువు తీసి తప్పించుకు తిరిగేవు
అభయ హస్తమునకు నువ్వు హస్తినకే పోయావు

సిగ్గు లేదు శరం లేదు చీము రక్తమసలు లేదు
ప్రాజాస్వామ్య దేశంలో జీవించే హక్కు లేదు

అన్యాయం అన్యాయం ఆపేద్దం ఈ రాజకీయం
చూపిద్దాం చూపిద్దాం నవయువ చైతన్యం
స్థాపిద్దాం స్థాపిద్దాం సమసమాజ సామ్రాజ్యం
మనం జనం , ప్రభంజనం లేదు మనకు ఏ విఘ్నం

నా బ్లాగు పరిచయం

రాజకీయం


రా - రాజ్యాంగబద్దంగా
జ - జనానికి
కీ - కీడుచెసే
యం - యంత్రాంగం


పైన చెప్పిన అర్ధం ఖచ్చితంగా నేటి రాజకీయ పరిస్థితికి సరిపోతుంది

గత కొంత కాలంగా భారత దేశంలో ముఖ్యంగా ఆంద్రప్రదెశ్ లో జరుగుతున్న రాజకీయ ఘటనలు చూస్తుంటే గాందీ గారు తెచ్చిన స్వతంత్రం అయనతో పాటే తీసుకుని వెల్లిపోయడా అని అనిపిస్తుంది.

నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా ఆంద్రప్రదెశ్ లోని ఒక గిరిజన ప్రాంతంలో. నాగరికత పుట్టిందా అన్నట్టు వుండే అమాయక ప్రజల జీవన విధానాన్ని స్వయంగా 18 సంవత్సరాలు చూసాను....ఎప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న ఆశ వుండేది ఎదో ఒక రోజు మాకు కూడ పట్నం వాళ్ళలా అన్ని సదుపాయాలు వస్తాయి అని కాని ఇప్పుడు నాకు తెలిసింది ఎప్పటికీ మా బ్రతుకులు మారవని ఎందుకంటే అభివ్రుద్ది చేయటానికి నిధులు కావాలి కాని ఆ నిధులను మన ప్రజాప్రతి ' నిధులు ' నిత్య నైవేద్యంలా మింగేస్తున్నారు........ ఈ పరిస్థితి ఎదో ఒక్క పల్లెకో, పట్నానికో, ఆంద్రప్రదెశ్ కో సంభందించినది కాదు యేవత్భారతదేశం ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థతో కుమిలిపోతుంది దీని మీద నేటి యువత అలుపెరుగని యుద్దం చేయాలి....అందుకే నేడు జరుగుతున్న అన్యాయాలను గొంతెత్తి విమర్శించే సత్తాలేని నాకు ఈ బ్లాగు ఒక రాజ మార్గం....... ఇక్కడ నేను ప్రతి నాయకుడు చెసే పిచ్చి పిచ్చి వాగ్దానాలను, వ్యాఖ్యలను ధైర్యంగా విమర్శించవచ్చు ఎందుకంటే మన నాయకులకు సంతకం పెట్టే కనీస ఙ్నానం కూడ లేదు కనుక నా ఈ బ్లాగుని చదివి నన్ను బెదిరించే అవకాశం ఎట్టి పరిస్థితిలోను వుండదు.... నా భయం ఎమిటంటే ఒకప్పుడు నాయకులు రోజు నైవేద్యం తినే పనిలొనే వుండేవాల్లు కనుక పక్క వాళ్ళు ఎమి తిట్టినా పట్టించుకొనే టైం వుండేది కాదు... కాని ఈ మద్యన మన భావి నాయకులు (అంటే దొంగనా కొడుకుల కొడుకులు ) ఎవరన్నా ఎమన్నా అంటే కొడుతున్నారు.... అందుకే ఇలా బ్లాగుల వెంట పడాల్సి వస్తుంది.