Saturday, August 11, 2007

ముదిగొండ ఆత్మ ఘోష

హలో నా పేరు ఆత్మా... అవును మనిషి చనిపోయాక బయటకు వచ్చేది ఆత్మే అయితే నా పేరు అదే..

10 రోజుల క్రితం నేను మనిషినే, మీలో ఒకడినే... ముదిగొండ అనే ఊర్లో కూలిపని చేసుకుంటూ బ్రతికేవాడిని ...కాని ఆ రోజు ఎవరో నాయకుల మాటలు విని భూపోరాటం అంటే ఇంటి కోసం స్థలం ఇస్తారు అనుకొని వెళ్ళాను కాని ఆ రోజు సాయంత్రం జరిగిన కాల్పులలో చనిపోయాక తెలిసింది నేను చేసిన భూపోరాటం ఇంటికోసం కాదు నన్ను కప్పెట్టటానికి కావలసిన ఆరు అడుగుల స్థలంకోసం అని...!!!

నేను చనిపోయాక నా శవంతో నాయకులు వేసిన నాటకాలు నా శవం పక్కనే వుండి చూసిన నాకు అంటే నా ఆత్మకు ఆశ్చర్యం వేసింది ....ఆ మొత్తం సంఘటన నా ఆత్మ ఘోషలో...

ముదిగొండ కాల్పులు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరినోట అయ్యొ పాపం అనేలా చేసాయి...కాని మన నాయకులు మాత్రం కేవలం రాజకీయలబ్ది కోసం మా ఈ చావులను, చచ్చిన శవాలను చివరి నిమిషం వరకు వాడుకోవటానికి ప్రయత్నించిన పద్దతి చూస్తుంటే... వీరికా మేము ఓట్లు వేసి గెలిపించింది అని సిగ్గుతో నాలో నేనె కుమిలిపోయాను...

వీధి కుక్కలు కూడ చచ్చిన శవాన్ని వాసన చూసి ఒక గంట సేపటికి వెల్లిపోతాయి .....కాని మన వీధి నాయకులు వాటికంటే మేము ఏమి తక్కువ అన్నట్టు మా శవాలను కలక్టరేటు ముందు పెట్టి వారి వారి పార్టీల జెండాలు మా శవాల మీద కప్పి రాబొయే ఎన్నికలలో గెలుపు కోసం పడుతున్న పాట్లు చూసి విమర్శించటానికి నాకు తెలుగు నిఘంటువులో పదాలు దొరకలేదు...అసలు కూలి పని చేసుకొని బ్రతికే నేను ఎప్పుడు ఏ పార్టీ సభ్యత్వము తీసుకొలేదు కాని ఇవ్వాల మాత్రం నా శవం మీద వీళ్ళ పార్టీ జెండాలు కప్పారు.....పొనీలే నేను బ్రతికుండగా ఏనాడు ఒక్క దుప్పటి కూడ ఇవ్వలేదాయే చచ్చినాకన్నా ఒక గుడ్డ ముక్క ఇచ్చారు అని సరిపెట్టుకున్నాను.


ఈ నాయకుల ఇంట్లో ఎవరన్నా చస్తే వారి శవాలను మాత్రం భద్రంగా ఒక బాక్స్ లో పెట్టి దానికి పూలదండలు వేసి వుంచుతారు, లభోదిభో అంటు ఎడుస్తారు...కాని ఇక్కడ చనిపోయిన మా శవాలను మా పెళ్ళాం, బిడ్డలకు కూడ ఇవ్వకుండ, గద్దలు తన్నుకు పోయినట్టుగా తన్నుకుపోయి మండుటెండలో కలక్టర్ అఫీసు ముందు పెట్టి ఓట్ల కోసం కాట్ల కుక్కల్లా ప్రవర్తించారు...అంతే కాకుండా...చిత్రమేమిటంటే ఒక పార్టీ వాళ్ళు మా శవాల దగ్గర ముందు వరసలో నుంచిని నవ్వు కోవటం వారికి మా మీద వున్న అభిమానానికి మచ్చుతునక...

మా శవాలు ఇంకా కాలక ముందే మన నాయకులు ఈ ఉద్యమాన్ని నేను మొదలుపెట్టానంటే నేను మొదలుపెట్ట అని మీడియా ముఖం గా చేసిన వ్యాఖ్యలు చూసి ....అయ్యో అనవసరంగా మన తాత ముత్తాతలు తెల్ల వాల్లను తరిమి కొట్టరే అని చాలా బాద వేసింది.

ఈ మొత్తం సంఘటనలో రాజకీయ పార్టీలు మా శవాలను ముందుపెట్టుకొని పేపర్ లో ఫోజులు ఇచ్చారు గాని చనిపోయిన మా మీద ఆధారపడి బ్రతుకుతున్న వారి కోసం ఒక్కడూ నోరు విప్పలేదు........కాల్పులకు బాధ్యుడు అంటూ ముఖ్యమంత్రి దిగిపొవాలి అన్నారు గాని బందుకు పిలుపునిచ్చి ఈ పరిస్థితికి కారణమయిన వాళ్ళను పల్లెత్తుమాట అనలేదు...

సీట్ల విలువ తెలిసిన ఈ నాయకులకు ఓట్లు వేసిన మా ప్రాణాల విలువ ఎప్పట్టి కి తెలుస్థుందో...!!!

1 comment:

vijju said...

చాలా బాగా రాసారు... హట్సాఫ్...