Saturday, April 5, 2008

ప్రాంతీయత ....!!!

ప్రజాస్వామ్యానికి ఈమద్య కాలంలో అర్దం మారుతున్నట్టుగా వుంది...కుల మత జాతి వర్ణ లింగ ప్రాంతీయ బాషా బేదాలు లేనిది నా భారతదేశం అని చెప్పటం అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే...... ఇప్పటి వరకు కులాలు మతాల పేరుతో కొట్టుకున్న మనం ఇప్పుడు ఒక్క అడుగు ముందుకేశాము అదే ప్రాంతీయత.... ప్రతీచోట పని లేని, పస లేని, అధికారంలో లేని పనికిమాలిన పార్టీలకు, చోటా మోట నాయకులకు ఇది ఒక AK 47 లాంటిది... పార్టీ కార్యకర్తలు అంటూ ఒక రౌడి మూకను తయారు చేసి వాళ్ళకు బీరు, బిర్యాని ఇచ్చి ప్రాంతీయత పేరుతో అమాయకులయిన ఒక పదిమందిని కొట్టి పేపర్లో ఫొజులివ్వటం ఈమద్య కాలంలో ఒక అలవాటులా మారింది...

ఆంధ్రప్రదేశ్...

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కలిసి పోరాడిన రోజులు చరిత్ర పుస్తకాలకు పరిమితమయ్యేలా వున్నాయి......నా తెలంగాణా కోటి రతణాల వీణ అన్న పలుకులు ప్రాంతీయత చిచ్చులో అపస్వరాలు పలుకుతున్నాయి.... కుటుంబ పెద్ద అనేవాడు ఎప్పుడు తన కుటుంబం కలిసి వుండాలి అనుకుంటాడు కాని ప్రజా కుటుంబానికి పెద్దలం అని చెప్పుకుతిరిగే ప్రజానాయకులు మాత్రం ఎప్పుడు వీల్లని విడగొడదామా అని చూస్తున్నారు....నా తెలంగాణ.... నా తెలంగాణ అని అరిచే నాయకుల కొడుకులు మాత్రం పక్క దేశంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేయొచ్చు కాని అదే రాష్ట్రంలో పుట్టిన మనకు మాత్రం వాళ్ళ ప్రాంతంలో వ్యాపారాలు చేయకూడదు. నాకు తెలిసి టి.ఆర్.యెస్ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం అంటుంది కేవలం ఆంధ్ర నుంచి తెలంగాణ రావటానికి, పోవటానికి కూడ ప్రత్యేక వీసాలు పెట్టాలి అని... ఎందుకంటే ఈ పార్టీలో నాయకులకు బాగా తెలిసిన వ్యాపారం దొంగ వీసాలతో పక్క దేశాలకు పంపటం...కాని కష్టంస్ వాళ్ళకు దొరికినప్పటినుంచి ఈ బిజినెస్ బాగా దెబ్బతింది దానితో ఆదాయం కూడా తగ్గింది ఇలా రాష్ట్రాన్ని విడగొడితే వీళ్ళు టాటా, బిర్లా, అంబానీలతో చాలా సులువుగా పోటీపడచ్చు.... కుటుంబంతో పాటు దొంగ వీసాలతో అమెరికా వెళ్ళాడు అని ఆరోపణలు ఉన్న ఒక అధికార పార్టీ నాయకుడు కూడా ప్రాంతీయత, ప్రత్యేక రాష్ట్రం అంటూ అరవటం చూస్తుంటే దొంగే ...దొంగా దొంగా అని అరవటంలాగ ఉంది. మొన్నటికి మొన్న తెలుగు కూడా మాట్లాడటం రాని ఒక ' తెలుగు ' హీరో తననెవరో కొట్టారన్న కారణంతో మరుసటి రోజు సింపులుగా నేను రాజకీయాలలోకి వస్తున్నానంటూ చెప్పి ప్రత్యేక తెలంగాణ కావాలి అని ఒక స్టేట్మెంట్ యిచ్చిపడేశాడు... యింకో మాజీ హీరోయిన్ పార్టీ పెట్టి ప్రజలకు కనిపించటం మానేసింది......కేవలం రెండు ఎమెల్యే సీట్లు ఉన్న బీజేపీ కూడ ప్రత్యేక రాష్ట్రం అంటుంది పాపం ఈసారి ఆ రెండు సీట్లు కూడ మిగలవని గ్రహిస్తే మంచిది.... కలిసుంటే కలదు బలం ఎదురురాదు ఏ అపజయం అన్న సంగతి గ్రహిస్తే మంచిది. ఈ ప్రాంతీయత అనే జబ్బు కేవలం ఎదో ఒక రాష్ట్రనికే పట్టలేదు మన పక్కన ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా దేశమంతా అంటువ్యాదిలా వేగంగా పాకుతుంది...... దీనికి ప్రజలు అనే వైద్యులు ఓటు అనే వేక్సిన్ తో చంపాలి......

ఈ నాయకులందరు ఒక్కసారి భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 19 చదివితే బాగుంటుంది.... దళితులు మాకు దేవుళ్ళు అనే ఈ పార్టీలు నాయకులు కేవలం అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయటం, పూల దండలు వేయటమేకాదు ఆయన రాసిన రాజ్యాంగాన్ని కూడా పాటించాలని తెలుసుకుంటే మంచిది...

ఆర్టికల్ 19: " ప్రతీ పౌరుడు భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్చగా తిరగటానికి, నివశించటానికి అధికారం ఉంది ".

నల్ల డబ్బును అడిగే హక్కు నల్ల కోటుకు లేదు...!!!

తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాలలో అన్ని పార్టీలు ఒక విషయం ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాయి అదేమిటంటే "రాజకీయనాయకుల అక్రమసంపాదనను ప్రశ్నించే హక్కు ప్రజలకే కాదు ఆ న్యాయస్థానాలకు కూడా లేదు". పవిత్రమైన అసెంబ్లీలో కూర్చోని ప్రజల సొమ్మును పందికొక్కులుగా ఎవరు ఎంత తిన్నరో వారే లెక్కలు చెప్పి ఆ నల్ల డబ్బును అడిగే హక్కు నల్ల కోటుకు లేదు అని చాల సింపుల్ గా తెల్చేసారు

Wednesday, October 10, 2007

స్వర్ణాంద్ర ముఖ్యమంత్రుల సంపాదన గంటకు కోటి...

నీ సంపదన గంటకు కోటి అంటే .... నీది కూడ కోటే కదా అనటం చూస్తుంటే .....జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందని అన్నట్టు ఉంది....వై యస్ ఆర్ గంటకు కోటి చోప్పున గడచిన 4 సంవత్సరాలలో 12 వేల కోట్లు సంపాదించాడు అని అంటున్న చంద్రబాబు నాయుడు ఈ 4 సంవత్సరాలు ఈ విషయం ప్రజలకు ఎందుకు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు చెపుతున్నాడు?? అలాగే చంద్రబాబు 9 సంవత్సరాలలో 50 వేల కోట్లు సంపాదించాడు అని అంటున్న కాంగ్రేస్ వాళ్ళు ఇన్నాళ్ళు ఎందుకు నోరు విప్పలేదు......ఇదంతా దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంది... ఎవడు తిన్నా అది ప్రజల సొమ్మే గా ఎవడి బాబు కష్టపడ్డది కాదు....అందుకే ఇన్నాళ్ళు అటు కాంగ్రేస్ వాళ్ళు, ఇటు తెలుగుదేశం వాళ్ళు అన్నీ మూసుకుని కూర్చున్నారు....ఇప్పుడు ఓట్లు, ఓటర్లు గుర్తొచ్చి ఒకడి గుట్టు ఒకడు చెప్తున్నాడు.

ఎవడబ్బ సొమ్మని కులుకుతున్నావు అని అడిగితే సమాదనం చెప్పటానికి వీళ్ళు శ్రీ రామచంద్రులు కారు.... 10 చేతులు ఉన్న రావణాసురులు. అయినా మన రాజకీయనాయకుల ఆస్తులు, అంతస్తులు, సంపాదనలు ఎవరికి తెలియవు గనుకా ఇవ్వాళ కొత్తగా తెలుసుకోవటానికి... ఇన్ని తెలిసినా ఇంకా కులం పేరుతో నాయకులను ఎన్నుకునే సంస్క్రుతి పోనంతకాలం మన బాబులు సంపాదించిన సోమ్ము ఎవడో ఒకడు ...ఇలాంటి రావణాసురులు తింటూనే ఉంటారు....

స్వర్ణాంద్ర అంటే .....ఆంధ్రప్రదేశ్ లో ఉన్న స్వర్ణం అంతా మా నాయకులు తినేస్తారని ఇప్పుడిప్పుడే అర్దమవుతుంది

Saturday, September 22, 2007

కరుణానిది కి పంచె మరోసారి ఊడాలా??

తిండి ఎక్కువయి .... పని తక్కువయితే కళ్ళు నెత్తి మీదకు వస్తాయి అని పెద్దవాళ్ళు అంటూ వుంటారు .....ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రికి అదే అయినట్టు వుంది. కొన్ని కోట్ల మంది భారతీయులు మహాపురుషుడుగా భావించి అదర్శంగా తీసుకునే శ్రీరాముడి ఉనికినే ప్రశ్నిస్తున్నాడు ... ఒకసారి ఎదో తొందరలో నోరు జారాడు అనుకుని వదిలేస్తే రొజు రొజుకీ ఆయన మాటలు హిందుత్వానే ప్రశ్నిస్తున్నాయి... ఆయన ఉన్నది 70 కోట్ల మంది ఉండే హిందూ దేశంలో అని గుర్తుపెట్టుకుంటే చాలమంచిది. అధికారంలో ఉన్నప్పుడు ఒంటి బలుపుతో చేసే తప్పులకు ఆ అధికారం పోయాక పంచె ఊడేదాక కొడతారన్న సంగతి అందరికంటే ఎక్కువగా గౌరవనీయులు, ముఖ్యమంత్రివర్యులు కరుణానిది కి బాగా తెలుసు .... ఆ పరిస్థితి తెచ్చు కోవాలని ఆయనకు సరదాగా ఉన్నట్టుంది.

మొట్టమొదటిసారిగా నేను హిందువును అనే విషయం పదే పదే గుర్తుకువచ్చింది... రాముడిని, రామాయణాన్ని అవమానపరచటం అంటే భారతదేశంలోని ప్రతీ హిందువుని అవమానపరచటమే... 80 సంవత్సరాల వయసు దాటిన ఒక రాష్ట్రాదినేత కనీస విగ్నత లేకుండ మాట్లడటం చూస్తుంటే ఇది ఏదో తెలియక చేసిన వ్యాఖ్యలు అని వదిలేయలేము .... ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన రచయిత్రి తస్లిమ బేగం రాసిన నవల ముస్లింలను అవమానపరిచేలా ఉంది అని ఆమెను హైదరాబాద్ లో ముస్లిం లు కొట్టారు .... 95% క్రైస్తువులు ఉండే అమెరికా వాళ్ళు జీసెస్ మీద "డా వించి కోడ్" అనే సినిమా తీస్తే అందులో కొన్ని అభ్యంతరకరమయిన సన్నివేశాలు వున్నాయని మన దేశంలో ఆ సినిమాను చాల రాష్ట్రాలలో రిలీజ్ చెయలేదు ....కొన్ని రాష్ట్రాలలో సినిమా హాళ్ళను ద్వంశం చేసారు...అలాంటి రాష్ట్రాల లిస్ట్ లో తమిళనాడు ఒకటి ... అలాంటప్పుడు కరుణానిది తలనరికితే నజరాన అని విశ్వ హిందు పరిషత్ ప్రకటించటం లో తప్పులేదనిపిస్తుంది....

పక్కవాడి నమ్మక్కాని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు .... రాజ్యంగం ప్రకారం భావ ప్రకటనా స్వేచ్చ ప్రతి ఒక్కరికి వుంది కాని పక్కవాడి కులాన్నో, మతాన్నో, సిద్దంతాన్నో పశ్నించే హక్కు ఎవడికి లేదు ఈ విషయం మన నాయకులకు తెలీకపోవటం బాధాకరం.

కరుణానిది వయసు పైన పడి అర్దంపర్దం లేకుండా మాట్లాడుతున్నట్టు వుంది....ముందు రాముడు కల్పితం అన్నాడు తర్వాత ఆయన లేడు అని చెప్పిన రాముడు తాగుబోతు అంటున్నాడు .... చూస్తువుంటే ఈయన ఎమైనా మందుకొట్టి మాట్లడుతున్నాడా అని సందేహం వస్తుంది. అయినా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న ఈయనకి ఏకపత్నీవ్రతుడు అయిన రాముడి గొప్పతనం ఎలా తెలుస్తుంది ??? తండ్రి మాట కోసం రాజ్యాని వదిలిన రాముడి గొప్పతనం అధికారం కోసం అడ్డమయిన పనులు చేసే కరుణానిదికి ఎలా తెలుస్తుంది.

Sunday, September 9, 2007

భాగ్యనగరంలో బ్రతుకు భయం

భాగ్యనగరం బాంబులతో బెంబేలెత్తిపోయింది..... మనుషులుగా పుట్టి మృగాలుగా బ్రతుకుతున్న కొంత మంది రాక్షసుల వికృత చేష్టలకు 44 మంది అమాయకులు (పిల్లలు, తల్లులు, విద్యార్దులు, ఇంకా ఎంతోమంది...) బలయిపోయారు.

ఇప్పటికయిన మన నాయకులు, రాజకీయ పార్టీలు కళ్ళు తెరవాలి....కులాలు, మతాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు మాని పార్లమెంటు మీద దాడి చేసి ఎందరో అమాయకుల ప్రాణాలు తీసిన కౄరమృగాలని వెంటనే నడిరోడ్డు మీద ఉరి తీయాలి.... చట్టం ముందు తప్పు చెసిన వాడు ఎవడైనా ఒక్కటే అన్న నిజాన్ని తీవ్రవాదులకు తెలియచేయాలి.

వందల మందిని చంపిన వాడిని శిక్షించకుండా వదిలేసినంత మాత్రాన ఆ కులం వాళ్ళో, ఆ మతం వాళ్ళో ఓట్లు వేస్తారని అనుకోవటం మన నాయకుల, పార్టీల వెర్రితనం ..... ఏ మతం, ఏ కులం తప్పు చేసినవాడిని వదిలేయమని చెప్పదు.... బాంబు పెట్టే వాడు ప్రజలను చంపాలనుకుంటున్నాడు గాని ...ఎదో ఒక కులం వాళ్ళనో, ఎదో ఒక మతం వాళ్ళనో చంపాలనుకోవటం లేదు......దీనికి సాక్షం 3 నెలల క్రితం మక్కామసీదులోను మొన్న లుంబిని పార్కు, గోకుల్ చాట్ లో జరిగిన విద్వంశం.....రెండు చోట్లా తరతమ భేదం లేకుండా, కుల మతాల ప్రస్థావన లేకుండా సామాన్యులు బలయిపోయారు.

మన ఇంటెలిజెన్సె బ్యూరోని, వచ్చే ఎలక్షన్స్ లో అధికార పక్షానికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే విషయాల కోసం కాకుండ ప్రజల శాంతి భద్రతల కోసం, తీవ్రవాదుల తోలుతీయటం కోసం ఉపయోగించే పాలకులు వచ్చేటంత వరకు ఇలాంటి సంఘటనలకు ప్రజలు బలికావలసిందే.

కాని ఒకటి మాత్రం నిజం ... ప్రాణాలు పోయాక వచ్చే ఎక్స్ గ్రేషియాలతో ప్రజలను మోసంచేయలేరు. మాజీమంత్రులకు, వాళ్ళ పిల్లలకు, పెళ్ళాలకు వందల కొద్ది సెక్యురిటీని పెట్టే ప్రభుత్వాలు ప్రజలకు కనీస భద్రత కావాలి అని గురుతు పెట్టుకుంటే మంచిది.... మేము పొయాక ఇచ్చే పైసలు ముందుగానే మా రక్షణ కోసం ముందుగానే ఖర్చుపెట్టండి.

Thursday, August 16, 2007

ఆంద్రప్రదేశ్ ...రాజీవ్ ప్రదేశ్....ఇందిరా ప్రదేశ్

చిన్నప్పుడు ఒక సామెత వినేవాడిని " పని లేని మంగలోడు పిల్లి తల గొరికాడు " అని అంధ్రప్రదేశ్ లో కాంగ్రేస్ వాళ్ళ పని అలానే వుంది...

రాష్ట్రంలో కుప్పలు కుప్పలు గా సమస్యలుంటే అవన్నీ వదిలేసి 40 సంవత్సరాల క్రితం పుట్టిన కూకటపల్లి హౌసింగ్ బోర్డ్ పేరును రాజీవ్ గాంధి హౌసింగ్ బోర్డ్ అని పేరు మారుస్తున్నాము అని కొత్త గొడవ పైకి తెచ్చింది ఇవ్వాల...

ఈ మద్యకాలంలో నేనే కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలుపెట్టిన రకరకాల స్కీముల పేర్లు చూసి .... దేని పేరు ఇందిరో దేని పేరు రాజీవో అర్దం కాక కనుఫ్యూజ్ అవుతున్నాను...

దేనికయినా ఒక లిమిట్ అంటూ వుంటుంది ......ఆ లిమిట్ దాటబట్టే బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు పట్టిన మనము ......అదే కాళ్ళు పట్టుకుని వాళ్ళ దేశానికి విసిరి కొట్టింది......పాలకులు చెసే ప్రతీ పని ప్రజలు చూస్తుంటారు .......కొంత వరకు తప్పులను క్షమిస్తారు... లిమిట్ దాటితే పాలకులు రోడ్డు మీద పకీర్లు కావలసిందే .....చూస్తుంటే కాంగ్రేసోల్లు పధకాలకు పేర్లు పెట్టే విషయంలో ఆ లిమిట్ ఎప్పుడో దాటేసారు .......ఇప్పటికి 23 పధకాలకు రాజీవ్, ఇందిర పేర్లు పెట్టారంట (ఈనాడు ప్రకారం)

కాంగ్రెసోల్లకు అంత అభిమానం వుంటే వాల్ల పిల్లలకో, తల్లులకో ఆ పేర్లు పెట్టుకొవచ్చు గా.....లేకపొతే వాళ్ళ కంపెనీలకు పెట్టుకొవచ్చుగా ...నేను ఏమి రాజీవ్, ఇందిరలకో లేక కాంగ్రెస్ కో వ్యతిరేకిని కాదు.... నేనూ వాళ్ళను గౌరవిస్తాను కాని వాళ్ళకంటే గొప్పవాళ్ళు చాల మంది వున్నారు.... మన రాష్ట్రంలొనే వున్నారు......ఒక అల్లూరి సీతరామరాజు, టంగుటూరి ప్రకాశం పంతులు, వీరేశలింగం పంతులు, సర్వేపల్లి రాధాక్రిష్ణ, పొట్టి శ్రీరాములు ఇలా చెప్పుకుంటూ పొతే ఈ లిస్ట్ కి ఎండ్ లేదు .....కాని పాపం మన కాంగ్రేసోల్లకు మతిమరుపు వచ్చినట్టు వుంది...... వీళ్ళకు కేవలం ఇందిర, రాజీవ్ లే గురుతున్నారు......

ఇంక మన విపక్షాల కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ...... కుర్చీ కోసం నక్కల్లా ఎదురుచూస్తు ఎప్పుడు బందులు చేద్దామా .....ఎప్పుడు పేపర్ లో మొదటి పేజ్ లో ఉందామ అని ఎదురు చూస్తుంటారు......వీళ్ళు దొరికిందే సందు అని కూకటపల్లి హౌసింగ్ బోర్డ్ పేరు మారుస్తున్నందుకు ఈ రోజు షాపులు, స్కూల్లు గట్రా బంద్ చేశారు ... పేరు మార్చిన కాంగ్రేసోల్లను ఏమి అనలేక ప్రజలను ఇబ్బంది పెట్టారు... ఈ ప్రతిపక్షాలు నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకుంటే వెళ్ళి పేరు మారుస్తాను అని అన్న వాడి ఇంటిని బంద్ చేయొచ్చు గా .....అలా చేయరు......ఎందుకంటే వీళ్ళకు అంత సీన్ లేదు......ప్రజలంటే పిచోళ్ళు వీళ్ళు చెప్పినవెంటనే షాపులు మూసెస్తారు ఎందుకంటే ఏ తిక్కోడు రాళ్ళు వేస్తాడో అని..... ఎంతకాలం ఈ రాజకీయ పార్టీల డ్రామాలు చూస్తుండాలి ...... ఏడుకొండలవాడా వీళ్ళను నువ్వే మార్చాలి లేకపొతే ... తిరుమల కొండను కూడ రాజీవ్ కొండ గా మార్చెస్తారు.......జర జాగ్రత్త...

ఆంద్రప్రదేశ్ ...రాజీవ్ ప్రదేశ్....ఇందిరా ప్రదేశ్

Saturday, August 11, 2007

ముదిగొండ ఆత్మ ఘోష

హలో నా పేరు ఆత్మా... అవును మనిషి చనిపోయాక బయటకు వచ్చేది ఆత్మే అయితే నా పేరు అదే..

10 రోజుల క్రితం నేను మనిషినే, మీలో ఒకడినే... ముదిగొండ అనే ఊర్లో కూలిపని చేసుకుంటూ బ్రతికేవాడిని ...కాని ఆ రోజు ఎవరో నాయకుల మాటలు విని భూపోరాటం అంటే ఇంటి కోసం స్థలం ఇస్తారు అనుకొని వెళ్ళాను కాని ఆ రోజు సాయంత్రం జరిగిన కాల్పులలో చనిపోయాక తెలిసింది నేను చేసిన భూపోరాటం ఇంటికోసం కాదు నన్ను కప్పెట్టటానికి కావలసిన ఆరు అడుగుల స్థలంకోసం అని...!!!

నేను చనిపోయాక నా శవంతో నాయకులు వేసిన నాటకాలు నా శవం పక్కనే వుండి చూసిన నాకు అంటే నా ఆత్మకు ఆశ్చర్యం వేసింది ....ఆ మొత్తం సంఘటన నా ఆత్మ ఘోషలో...

ముదిగొండ కాల్పులు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరినోట అయ్యొ పాపం అనేలా చేసాయి...కాని మన నాయకులు మాత్రం కేవలం రాజకీయలబ్ది కోసం మా ఈ చావులను, చచ్చిన శవాలను చివరి నిమిషం వరకు వాడుకోవటానికి ప్రయత్నించిన పద్దతి చూస్తుంటే... వీరికా మేము ఓట్లు వేసి గెలిపించింది అని సిగ్గుతో నాలో నేనె కుమిలిపోయాను...

వీధి కుక్కలు కూడ చచ్చిన శవాన్ని వాసన చూసి ఒక గంట సేపటికి వెల్లిపోతాయి .....కాని మన వీధి నాయకులు వాటికంటే మేము ఏమి తక్కువ అన్నట్టు మా శవాలను కలక్టరేటు ముందు పెట్టి వారి వారి పార్టీల జెండాలు మా శవాల మీద కప్పి రాబొయే ఎన్నికలలో గెలుపు కోసం పడుతున్న పాట్లు చూసి విమర్శించటానికి నాకు తెలుగు నిఘంటువులో పదాలు దొరకలేదు...అసలు కూలి పని చేసుకొని బ్రతికే నేను ఎప్పుడు ఏ పార్టీ సభ్యత్వము తీసుకొలేదు కాని ఇవ్వాల మాత్రం నా శవం మీద వీళ్ళ పార్టీ జెండాలు కప్పారు.....పొనీలే నేను బ్రతికుండగా ఏనాడు ఒక్క దుప్పటి కూడ ఇవ్వలేదాయే చచ్చినాకన్నా ఒక గుడ్డ ముక్క ఇచ్చారు అని సరిపెట్టుకున్నాను.


ఈ నాయకుల ఇంట్లో ఎవరన్నా చస్తే వారి శవాలను మాత్రం భద్రంగా ఒక బాక్స్ లో పెట్టి దానికి పూలదండలు వేసి వుంచుతారు, లభోదిభో అంటు ఎడుస్తారు...కాని ఇక్కడ చనిపోయిన మా శవాలను మా పెళ్ళాం, బిడ్డలకు కూడ ఇవ్వకుండ, గద్దలు తన్నుకు పోయినట్టుగా తన్నుకుపోయి మండుటెండలో కలక్టర్ అఫీసు ముందు పెట్టి ఓట్ల కోసం కాట్ల కుక్కల్లా ప్రవర్తించారు...అంతే కాకుండా...చిత్రమేమిటంటే ఒక పార్టీ వాళ్ళు మా శవాల దగ్గర ముందు వరసలో నుంచిని నవ్వు కోవటం వారికి మా మీద వున్న అభిమానానికి మచ్చుతునక...

మా శవాలు ఇంకా కాలక ముందే మన నాయకులు ఈ ఉద్యమాన్ని నేను మొదలుపెట్టానంటే నేను మొదలుపెట్ట అని మీడియా ముఖం గా చేసిన వ్యాఖ్యలు చూసి ....అయ్యో అనవసరంగా మన తాత ముత్తాతలు తెల్ల వాల్లను తరిమి కొట్టరే అని చాలా బాద వేసింది.

ఈ మొత్తం సంఘటనలో రాజకీయ పార్టీలు మా శవాలను ముందుపెట్టుకొని పేపర్ లో ఫోజులు ఇచ్చారు గాని చనిపోయిన మా మీద ఆధారపడి బ్రతుకుతున్న వారి కోసం ఒక్కడూ నోరు విప్పలేదు........కాల్పులకు బాధ్యుడు అంటూ ముఖ్యమంత్రి దిగిపొవాలి అన్నారు గాని బందుకు పిలుపునిచ్చి ఈ పరిస్థితికి కారణమయిన వాళ్ళను పల్లెత్తుమాట అనలేదు...

సీట్ల విలువ తెలిసిన ఈ నాయకులకు ఓట్లు వేసిన మా ప్రాణాల విలువ ఎప్పట్టి కి తెలుస్థుందో...!!!